ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు రానున్నాడు. ప్రస్తుతం విశాఖ ఎంపీగా ఉన్న కంభంపాటి హరిబాబును ఆ పదవి నుంచి తప్పించి కొత్త వారికి ఇవ్వాలని అధిష్టానం డిసైడ్ అవ్వడంతో ఇప్పుడు ఈ పదవి కోసం కాపు సామాజికవర్గం నుంచి సోము వీర్రాజు, కమ్మ సామాజికవర్గం నుంచి కేంద్ర మాజీమంత్రి కావూరి పేర్లు రేసులో ఉన్నాయి. అయితే వీరిలో రాజకీయంగా అపర చాణుక్యుడు అయిన కావూరి తనదైన శైలిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం గట్టి ప్రయత్నాలు సాగిస్తున్నారట. ఇప్పటికే , తనకు అనుకూలంగా కొందరు సీనియర్ నాయకుల మద్దతు కూడగట్టుకున్నారని వినికిడి.
బీజేపీ నాయకురాలు పురంధేశ్వరితో పాటు గుంటూరుకు చెందిన కొందరు నాయకులు కూడా ఆయనకు మద్దతివ్వడానికి సిద్ధంగా ఉన్నారట. అదే సమయంలో కావూరికి ఢిల్లీ స్థాయిలో మంచి పలుకుబడి ఉండటంతో, అదికూడా ప్లస్‌పాయింట్ అవుతుందని రాజకీయ పరిశీలకుల అంచనా. అయితే సందట్లో సడేమియా అన్నట్టు… కావూరి అభ్యర్థిత్వాన్ని అడ్డుకోవడానికి కొందరు నేతలు తెరచాటు ప్రయత్నాలు మొదలుపెట్టారట.
కావూరి వ్యాపార లావాదేవీలకు సంబంధించిన వివాదాలను ప్రస్తావిస్తూ, అటువంటి వారికి కీలక పదవి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారట. అయితే కావూరు వర్గం మాత్రం రాజకీయాలు వేరు..వ్యాపారాలు వేరు అని చెపుతున్నారట. మొత్తంమీద బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్నికలు మాంచి రంజుగా సాగబోతున్నాయనేది సుస్పష్టం. మరి ఇతర అభ్యర్ధుల పోటీని కావూరి ఎలా తట్టుకుంటారో, ఆ పదవిని చేజిక్కుంచుకుంటారో లేదో అనే విషయాలు తెలియాలంటే వేచి చూడక తప్పదు.
No comments:
Post a Comment