ప్రస్తుతం `ఆపరేషన్ టీడీపీ` విజయవంతంగా.. సాఫీగా సాగిపోతోంది. ఒకరి తర్వాత ఒకరు, ఒకరితో ఒకరు కలిసి టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరిపోతున్నారు. మరి తర్వాత `ఆపరేషన్ కాంగ్రెస్` మొదలవబోతోందా? ఖేడ్ ఉప ఎన్నిక తర్వాత ఇందుకు కేసీఆర్ ముహూర్తం ఖరారు చేశారా? ప్రస్తుతానికి కాంగ్రెస్‌ను టీఆర్ఎస్ లైట్ తీసుకుందా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు.
టీ టీడీపీ నేతలకు కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. `రండి.. మా పార్టీలో చేరండి. 2019 ఎన్నికల్లో అందరం కలిసి పోటీచేసి టీఆర్ఎస్‌ను ఓడిద్దాం` అంటూ ఆపర్ ఇచ్చారు. దీనిపై తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్నారు. `కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్` ను మొదలుపెట్టడం కాదు..ఆ పార్టీ నుంచే టీఆర్ఎస్ లోకి వెళ్లే నేతలు సిద్ధంగా ఉన్నారని ఎద్దేవా చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తరువాత టీడీపీ నేతలు ఎలా వరుసగా కారెక్కారో..నారాయణ్ ఖేడ్ ఎన్నికల తరువాత కాంగ్రెస్ వంతు స్టార్ట్ అవుతుందని టీఆర్ఎస్ వర్గం చెబుతోంది.
ఇప్పటికే దానం నాగేందర్ కాంగ్రెస్ గ్రేటర్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. గతంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం గుమ్మం వరకు వచ్చిన దానం.. పార్టీ బుజ్జగింపులతో వెనుతిరిగారు. ఇక జానారెడ్డి కూడా పలు సందర్భాల్లో కేసిఆర్ కు అనుకూలంగా వ్యవహరించి కాంగ్రెస్ కు షాకిచ్చారు. గత ఏడాది జానారెడ్డి పార్టీ వీడే అంశంపై విస్తృత ప్రచారం జరిగింది. ఇలా..టీకాంగ్రెస్ లోని ముఖ్యనేతలు..టీఆర్ఎస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు అధికార ప్రకటన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఖేడ్ ఎన్నికల తరువాత కాంగ్రెస్ పై దృష్టి పెట్టాలని.. తెలంగాణాలో ప్రతిపక్షం లేకుండా చేయాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటివరకూ టీడీపీ నేతల గురించి చెప్పుకున్నట్టే తరువాత కాంగ్రెస్ నేతల గురించి చెప్పుకోవాల్సి వచ్చే రోజులు త్వరలోనే రానున్నాయన్నమాట.
No comments:
Post a Comment