రాష్ట్ర విభజన జరిగి 16 నెలలు గడుస్తున్నా.. ఇంకా ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు పరిష్కారమవలేదు. ఇప్పటికీ పలు అంశాలపై కోర్టులో కేసులు నడుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఉన్నత విద్యా మండలి ఆస్తుల వివాదం ఇరు రాష్ట్రాల మధ్య రాజుకుంటూనే ఉంది. అయితే ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వాదనను సుప్రీం కొట్టిపారేసింది. అంతేగాక తెలంగాణ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం అక్షింతలు వేసింది.
ఏపీ ఉన్నత విద్యా మండలి ఉనికిలో లేదని, ఆ సంస్థకు సంబంధించిన ఆస్తులన్నీ తెలంగాణ ఉన్నత విద్యా మండలికే చెందుతాయంటూ తెలంగాణ సర్కారు తమ ఖాతాలోకి జమ చేసుకుంది. దీనిపై ఏపీ ప్రభుత్వం ఉమ్మడి హైకోర్టులో ఫిర్యాదు చేయగా తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును ఏపీ ఉన్నత విద్యా మండలి సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఈ కేసుపై న్యాయమూర్తులు జస్టిస్ వి.గోపాలగౌడ, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. విభజన అనంతరం 13 జిల్లాల ఏపీలో పరీక్షలు నిర్వహించేందుకు గాను ఫీజులు వసూలు చేశామని, ఆ మొత్తాల ప్రత్యేక అకౌంట్లలో జమ చేశామని, వీటిని కూడా తెలంగాణ ఉన్నత విద్యా మండలికే చెందుతాయని తీర్పు ఇవ్వటం సమజసం కాదని ఏపీ న్యాయవాదులు పేర్కొన్నారు.
దీంతో జస్టిస్ గోపాల గౌడ స్పందిస్తూ, “ఏపీలో వసూలు చేసిన ఫీజు మొత్తాలను తిరిగి వారికి ఇవ్వటానికి తెలంగాణ మండలికి అభ్యంతరం ఎందుకు?” అని తెలంగాణ తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది రావల్ ని ప్రశ్నించింది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం విచారణ సమయానికి ముందురోజే తెలంగాణ సర్కారు అఫిడవిట్‌ను దాఖలు చేసిందని, దానిని అధ్యయనం చేసేందుకు తమకు కొంత సమయం కావాలని కోరారు. మరి ఈ కేసులో ఏపీకి బాసటగా సుప్రీం నిలబడటం రాష్ట్రానికి మేలు చేకూర్చే అంశమే!
No comments:
Post a Comment