గ్రేటర్ ఎన్నికల పోలింగ్ పర్వం ముగిసింది. పాతబస్తీలో చిన్న పాటి సంఘటనలు మినహాయిస్తే గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల పోలింగ్ సజావుగానే సాగిందని చెప్పుకోవచ్చు. ఇంతకీ గ్రేటర్ ఓటరు ఎవరి వైపు మొగ్గు చూపాడు.? కారు వేగం కొనసాగుతుందా.? టీడీపీ – బీజేపీ కూటమి ఉనికిని చాటుకుంటుందా.? కాంగ్రెస్ సంగతేంటి.? మజ్లిస్ సత్తా ఎంత.? ఈ ప్రశ్నలకు గ్రేటర్ ఎన్నికల ఫలితాల వెల్లడితోనే సమాధానం దొరుకుతుంది. గ్రేటర్ పోలింగ్‌పై ఎవరి అంచనాలు ఎలా ఉన్నా ఎగ్జిట్ పోల్స్ లెక్కల ప్రకారం చూస్తే కారు జోరుకి తిరుగు లేనట్లే కన్పిస్తోంది.
టీఆర్‌ఎస్ అంచనా వేస్తున్నట్లే 70 నుంచి 80 సీట్లు ఆ పార్టీకి దక్కే అవకాశం కనిపిస్తోంది. టీఆర్‌ఎస్ లెక్కల ప్రకారమే మజ్లిస్ పార్టీకి రెండో స్థానం దక్కుతుందట. 40 సీట్ల పైనే మజ్లిస్ దక్కించుకుంటుందట. టీడీపీ – బీజేపీ కూటమికి గట్టిగా 35 సీట్లు వస్తే గొప్పేనన్నది ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నమాట. కాంగ్రెస్ సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుందని సమాచారం.
ఇక టీఆర్ఎస్ తరపున ఈ ఎన్నికలను పూర్తిగా తలకెత్తుకుని బాధ్యతలు చూసిన మంత్రి కేటీఆర్ అయితే తమకు 80 స్థానాల వరకు వస్తాయని లెక్కలు వేస్తున్నారు. ఇక కేసీఆర్ అయితే మంగళవారం రాత్రి గ్రేటర్ ఫలితాలపై ఓ మంత్రికి ఫోన్ చేసి మనం గ్రేటర్‌లో 90 సీట్ల వరకు గెలవబోతున్నాం అని ధీమాతో చెప్పారట. ఏదేమైనా ప్రస్తుతం ఉన్న సర్వేలు, అంచనాలు, ఎగ్జిట్ ఫోల్స్ ప్రకారం గ్రేటర్ పీఠంపై గులాబి జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది.
No comments:
Post a Comment