కాపు గర్జన`తో ఏపీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. తునిలో విధ్వంసం సృష్టించారు. రైలు, రాస్తారోకోతో జనాలు భయాందోళనకు గురయ్యారు. ముందు శాంతియుతంగా నిర్వహించాలనుకున్న సభ..ఉద్రిక్త పరిస్థితులకు అకస్మాత్తుగా దారితీయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కొన్ని అసాంఘిక శక్తులు కలిసి ఈ విధ్వంసానికి పాల్పడ్డాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యమేనని, ప్రభుత్వమే బాధ్యత వహించాలని వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ సభకు నాయకత్వం వహించిన ముద్రగడ పద్మనాభంపై ఏపీ మంత్రులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. వైకాపా అధినేత ప్రోద్బలంతోనే ముద్రగడ ఇలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
కాపులను ముద్రగడ తప్పుదోవ పట్టిస్తున్నారని హోంమంత్రి చినరాజప్ప, మంత్రి నారాయణ ఆరోపించారు. కాపు రిజర్వేషన్లపై జీవో ఇస్తే కోర్టులో అది నిలబడదని తెలిపారు. దీక్షల పేరుతో బ్లాక్‌మెయిల్ చేయడం ముద్రగడకు అలవాటేనని చినరాజప్ప విమర్శించారు. కాపు రిజర్వేషన్లపై కమిషన్ నివేదిక వచ్చిన తర్వాతే రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుంటామని హోంమంత్రి చెప్పారు. మంత్రిగా ఉన్న సమయంలో కాపులకు ప్రవేశం లేదంటూ చాంబర్ ముందు ముద్రగడ బోర్డు పెట్టించారని చినరాజప్ప ఆరోపించారు. 15 రోజుల క్రితం వైకాపా నేత కరుణాకర్ రెడ్డి ముద్రగడను కలిసి డబ్బు అప్పగించారని హోంమంత్రి ఆరోపించారు. ముద్రగడ వెనుక వైకాపా నేతలున్నారని మండిపడ్డారు. రైల్‌రోకో, రాస్తారోకో చేయాలని ముద్రగడ పద్మనాభం అప్పటికప్పుడు మాత్రమే పిలుపు ఇచ్చారని… ఆయన రెచ్చగొట్టేలా మాట్లాడటం వల్లనే ఈ ఘటనలు జరిగాయని మంత్రి నారాయణ మండిపడ్డారు.
No comments:
Post a Comment