తూర్పుగోదావరి జిల్లా తునిలో జరుగుతున్న కాపు గర్జనలో తలెత్తిన హింసాత్మక సంఘటనలపై ఏపీ సీఎం చంద్రబాబు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఘటన వెనక వైకాపా హస్తం ఉందని ఆయన ఆరోపించారు. కాపుల రిజర్వేషన్ సున్నితమైన అంశమని, ఆ సామాజికవర్గాన్ని అడ్డు పెట్టుకుని కొంతమంది విధ్వంస చర్యలకు కుట్ర పన్నారని ఆయన అన్నారు. రైళ్లు తగులబెట్టేంత ఆలోచన తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు ఉంటుందా? అని ప్రశ్నించచిన చంద్రబాబు.. కొన్ని రాజకీయ శక్తులు రాజకీయ దురుద్దేశంతో ఈ పరిస్థితి సృష్టించాయని, స్వార్థం కోసం వారు తెర వెనక ఉండి విధ్వంసం సృష్టించారని ఆయన మండిపడ్డారు.
పులివెందులలో ఇలాంటి రౌడీయిజం, ఇలాంటి హింసాత్మక సంఘటనలు జరిగితే మామూలే అన్నట్టు ఉండేది. కానీ ప్రశాంతంగా ఉండే తూర్పుగోదావరి జిల్లా తునిలో ఈ ఘటన జరగడం ఊహకు అందనిదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఒక నేరగాడి కుట్ర వల్లే ఇదంతా జరిగిందని చెప్పిన చంద్రబాబు పరోక్షంగా జగన్‌ను ఉద్దేశించి విమర్శలు చేశారు. అసెంబ్లీలోనూ, బయట రౌడీయిజం చేయాలని చూస్తున్నారని, ఇలాంటి పనుల చేయడం వల్ల ఎవరికి నష్టమో కాపులు ఆలోచించుకోవాలని వివరించారు.
కులాల మధ్య చిచ్చు పెట్టి కొన్ని శక్తులు రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటున్నాయని ఆయన మండిపడ్డారు. ఈ ఘటన వెనక ఉన్న రౌడీ శక్తులు హింసాకాండకు పాల్పడితే సహించమని…. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కాపులకు రిజర్వేషన్ అంశం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉందని, దీనిపై కమిషన్ ఏర్పాటు చేసి దీన్ని సమీక్షించాలని కోర్టు ఆదేశించిందని ఆయన చెప్పారు. కాపులను బీసీల్లో చేర్చాలనుకుంటే తాను ఈ రోజే జీవో ఇస్తానని…అయితే కోర్టులు కొట్టివేసే జీవోల వల్ల ఉపయోగం ఉండదని ఆయన చెప్పారు.
No comments:
Post a Comment