అధినేతల రంగప్రవేశంతో గ్రేటర్ వార్ మరింత రసవత్తరంగా మారింది. ఇద్దరు చంద్రులూ బరిలోకి దిగారు. తాము గతంలో చేసిన అభివృద్ధే అస్త్రంగా చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు.
అభివృద్ధి కావాలంటే టీడీపీని గెలిపించాలని కోరుతున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని, తమని గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందని బీజేపీ కూడా చెబుతోంది. గత ప్రభుత్వాల వల్లే ప్రస్తుతం హైదరాబాద్ దుస్థితి ఇలా ఉందని టీఆర్ఎస్ విమర్శిస్తోంది. ప్రచారంలోకి దిగగానే టీడీపీ-బీజేపీలకు తెలంగాణ సీఎం కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు.
టీడీపీ, బీజేపీలపై కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబుపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతుందని టీడీపీ నేతలు ప్రచారం చేస్తుండడంతో… అమరావతికే దిక్కులేదు.. ఇక హైదరాబాద్ కు నిధులెక్కడి నుంచి తెచ్చి అభివృద్ధి చేస్తారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా అమరావతి శంకుస్థాపనకు వెళ్లినపుడు జరిగిన సంఘటనను గుర్తుచేసుకున్నారు. `అమరావతి నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం తరపున విరాళం ప్రకటించాలనుకుని శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లా. వేదిక మీద ఉండగా ప్రధాని మోడీ రెండు కుండలు తెచ్చి టీపాయ్ మీద పెట్టారు. అవేంటని పక్కనే ఉన్న వెంకయ్యనాయుడిని అడిగా. అందులో మట్టి – నీరు ఉన్నాయని చెప్పారు. దీంతో మొత్తం విషయం అర్థమైంది.
ప్రధాని సాయమేమీ చేయరని.. ఆయన మాట్లాడటానికి ముందే వెంకయ్య నాతో చెప్పారు. ప్రధానే సాయం చేయనప్పుడు తానే ప్రకటిస్తే బాగోదని విరాళం ఇవ్వాలన్న ఆలోచన మానుకున్నా` అని తెలిపారు. ఈ మాట మంత్రి యనమలతో చెప్పానన్నారు. ఇంతకీ కేసీఆర్ విరాళం ఎంత ప్రకటించాలనుకున్నారో తెలుసా..? ఆయన నేరుగా చెప్పింది కాదుగానీ.. అప్పట్లో బయటకొచ్చిన సమాచారం ప్రకారం 200 కోట్లు ఇవ్వాలని అనుకున్నారట. ఇక అమరావతికి నిధులు తెచ్చుకోలేనివారు హైదరాబాద్‌ని ఎలా అభివృద్ధి చేస్తారని ఎద్దేవా చేశారు. `ఒకే దెబ్బకు రెండు దెబ్బలు` అనే సామెతను మరోసారి నిరూపిస్తూ.. అటు చంద్రబాబు, ఇటు ప్రధాని మోడీని ఒకేసారి ఇరుకున పెట్టేశారు.
No comments:
Post a Comment